21 వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ

 మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ


ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, కమిషనర్ చల్లా ఓబులేసు

Plantation Drive 


ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, వాటి పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 36వ వార్డు హోసన్న మందిర్ సమీపంలో మొక్కలు నాటారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని అన్నారు. చెట్లు ప్రకృతికి ప్రాణాధారమని, వాతావరణ సమతుల్యతను కాపాడటంలో వాటి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని పెంచాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల భాగస్వామ్యంతో విస్తృత స్థాయిలో హరితాభివృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు.


కమిషనర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి పెంచడం కూడా అంతే ముఖ్యమన్నారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని, వివిధ వార్డుల్లో 21 వేల మొక్కలను నాటే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసి మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.


కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి , ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ కృష్ణలత, హార్టికల్చర్ ఏడి ప్రతాప్ రెడ్డి, ఏఈ ఖాసిం, సానిటరీ ఇంస్పెక్టర్‌ ఆలీం బాష, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Comments