స్వీయ వ్యర్థాల నిర్వహణతో కాలుష్య నియంత్రణ
•వ్యాపార, వాణిజ్య సముదాయాలు సొంతంగా వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి
• శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణతో పరిశుభ్రమైన వాతావరణం సాధ్యం
• జిల్లా కలెక్టర్, నగరపాలక ప్రత్యేక అధికారిణి డాక్టర్ ఏ. సిరి
నగరంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు తమ వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సొంతంగానే ప్రాసెస్ చేసేందుకు వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, నగరపాలక ప్రత్యేక అధికారిణి డాక్టర్ ఏ. సిరి సూచించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక జ్యోతి డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో యాజమాన్యానికి ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026 పై అవగాహన కల్పించి 'బల్క్ వేస్ట్ జనరేటర్' నమోదు ప్రక్రియను కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి ఆమె ప్రారంభించారు.
![]() |
| Dr A Siri I.A.S |
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా రోజుకు 100 కిలోలకుపైగా ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేసే వ్యాపార, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాళ్లు, విద్యాసంస్థలు తదితర సంస్థలు బల్క్ వేస్ట్ జనరేటర్లుగా నమోదు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఇటువంటి సంస్థలు తమ వద్ద ఉత్పత్తి అయ్యే తడి వ్యర్థాలను సాధ్యమైనంత వరకు ప్రాంగణంలోనే కంపోస్టింగ్, బయోమీథనేషన్ లేదా ఇతర ఆమోదిత సాంకేతికతల ద్వారా శాస్త్రీయంగా ప్రాసెస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సిపిపిబి) కేంద్రీకృత ఆన్‌లైన్ పోర్టల్‌లో సంబంధిత సంస్థలు నమోదు చేసుకోవడం ద్వారా బల్క్ వేస్ట్ జనరేటర్లుగా గుర్తింపు పొందుతాయని తెలిపారు. అనంతరం నగరపాలక సంస్థ సంబంధిత వివరాలను ధృవీకరించి, నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సిన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లపై అవసరమైన మార్గదర్శకాలు అందిస్తుందని చెప్పారు. నిబంధనలను పాటించని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థకు ఉందని స్పష్టం చేశారు.
నగరపాలక కమిషనర్ మాట్లాడుతూ.. వ్యర్థాలను మూలంలోనే శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరచవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన వ్యర్థాల నిర్వహణ లక్ష్యంగా ప్రభుత్వం ఇటువంటి స్వీయ వ్యర్థాల ప్రాసెసింగ్ విధానాలను ప్రోత్సహిస్తోందన్నారు. పెద్ద వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, విద్యాసంస్థలు, హాస్టల్, తదితర వేస్ట్ జనరేటర్లు నిబంధనలకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి వ్యర్థాలను మూలంలోనే శాస్త్రీయంగా నిర్వహించాలని కమిషనర్ సూచించారు. ఈ విధానం ద్వారా నగరపాలక సంస్థపై వ్యర్థాల రవాణా భారం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు దోహదపడుతుందని తెలిపారు. సంబంధిత నిబంధనలను ప్రతి బల్క్ వేస్ట్ జనరేటర్ తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ సూచించారు.
కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, డిఈఈ పవన్, సానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, ఇంస్పెక్టర్లు జిలాని, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment
For suggestions / doubts / complaints