కర్నూలు, 13 మార్చి 2026:
క్లస్టర్ విశ్వవిద్యాలయం, కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో "రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమిస్ట్రీ" అనే అంశంపై గత ఐదు రోజులుగా జరుగుతున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ శుక్రవారం ఘనంగా ముగిసింది.
ఈ ముగింపు కార్యక్రమానికి ప్రముఖ రిసోర్స్ పర్సన్ ప్రొఫెసర్ ఎల్. శివశంకర్ రెడ్డి గారు విచ్చేసి అధ్యాపకులకు, పరిశోధకులకు 'ఔషధ ఆవిష్కరణలో మాలిక్యులర్ డాకింగ్ పాత్ర' మాలిక్యులర్ డాకింగ్ అంశంపై లోతైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాలిక్యులర్ డాకింగ్ అధ్యయనాలు అనేవి కంప్యూటర్ ఆధారిత బయోఇన్ఫర్మాటిక్స్ పద్ధతులని, వీటి ద్వారా ఒక లిగాండ్ ఔషధ అణువు ప్రోటీన్ యొక్క యాక్టివ్ సైట్‌లో ఎలా బంధించబడుతుందో, ఆ బైండింగ్ బలం ఎంత ఉందో ముందే అంచనా వేయవచ్చని వివరించారు. కొత్త ఔషధాల అభివృద్ధిలో ఈ విధానం అత్యంత కీలకమైనదని ఆయన పేర్కొన్నారు.
శిక్షణలో భాగంగా పాల్గొన్న ప్రతినిధులకు మాలిక్యులర్ డాకింగ్ సాఫ్ట్‌వేర్‌ల వినియోగంపై గత రెండు రోజులుగా ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. ప్రయోగశాలలో చేసే ఖరీదైన పరీక్షలకు ముందే కంప్యూటర్ సహాయంతో ఫలితాలను విశ్లేషించడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని ప్రొఫెసర్ వివరించారు.
కెమిస్ట్రీ విభాగాధిపతి మరియు ఎఫ్ డి పి కన్వీనర్ డాక్టర్ జె కల్పన మాట్లాడుతూ, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అధ్యాపకులు ఇటువంటి ఆధునిక పద్ధతులపై పట్టు సాధించాలనే ఉద్దేశంతో డీ బీ టీ స్టార్ కాలేజీ సహకారంతో ఈ ఐదు రోజుల శిక్షణను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
కార్యక్రమానంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వెంకటరెడ్డి ప్రొఫెసర్ ఎన్ శివశంకర్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగపు అధ్యాపకులు, వివిధ కళాశాలల నుండి వచ్చిన పరిశోధకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.